విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి అమ్రీన్ భ‌ట్ మృతి

TV Actor Shot Dead By Terrorists In Kashmir's Budgam.జ‌మ్ముకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 4:09 AM GMT
విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి అమ్రీన్ భ‌ట్ మృతి

జ‌మ్ముకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్ల‌ను టార్గెట్ చేసి ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో టీవీ న‌టి అమ్రీన్ భ‌ట్ ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. బుద్గామ్ జిల్లాలోని చదూరాలోని హిష్రూ ప్రాంతంలో బుధ‌వారం రాత్రి ఉగ్ర‌వాదులు సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్‌ చేసి కాల్పులకు తెగబడ్డారు. టీవీ న‌టి అమ్రీన్ భ‌ట్ ఇంటిపై కూడా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో టీవీ న‌టి అమ్రీన్ భ‌ట్(35) కు తీవ్ర‌గాయాలు అయ్యాయి.ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె 10 ఏళ్ల మేన‌ల్లుడు ప‌ర్హాన్ జుబీర్ చేతికి బుల్లెట్ గాయ‌మైంది. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్ప‌డినట్లుగా పోలీసులు తెలిపారు. రంగంలోని దిగిన పోలీసులు, బ‌ల‌గాలు ఆప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చేప‌ట్టారు.

టీవీ న‌టి అమ్రీన్ భ‌ట్ మ‌ర‌ణించడం ప‌ట్ల జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి విచారం వ్య‌క్తం చేశారు. 'అమాయక మహిళలు, పిల్లలను ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడం సమర్థించబడదు' అని అన్నారు. 'అమ్రీన్ భట్‌పై హంతక మిలిటెంట్ దాడికి దిగ్భ్రాంతికరం, తీవ్ర విచారం. దురదృష్టవశాత్తు అమ్రీన్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు, ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. ఈ విధంగా అమాయక మహిళలు, పిల్లలను టార్గెట్ చేయడాన్ని సమర్థించలేము. అల్లా ఆమెకి జన్నత్‌లో చోటు కల్పించాలి" అని అబ్దుల్లా ట్వీట్ చేశారు.

కాగా.. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it