ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసిన న‌టుడు.. వైద్యులు కాలు తొల‌గించారు

TV actor Lokendra Singh's leg gets amputated.ఆరోగ్యంగా ఉన్నంత వ‌ర‌కే మ‌నం ఏ ప‌నినైనా చేయ‌గ‌లిగేది. చిన్నపాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 10:29 AM IST
ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసిన న‌టుడు..  వైద్యులు కాలు తొల‌గించారు

ఆరోగ్యంగా ఉన్నంత వ‌ర‌కే మ‌నం ఏ ప‌నినైనా చేయ‌గ‌లిగేది. చిన్నపాటి అనారోగ్య‌మే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే చివ‌రికి భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. అందుకే మ‌న పెద్ద‌లు అంటుంటారు ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అని. కుడి పాదంలో చిన్న క‌ణతే క‌దా అని నిర్ల‌క్ష్యం చేయ‌డంతో ప్ర‌స్తుతం కాలుని పోగొట్టుకున్నాడు బుల్లితెర న‌టుడు లోకేంద్ర సింగ్ రాజ‌వ‌త్. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే చెప్పాడు. వివ‌రాల్లోకి వెళితే.. 'జోధా అక్బర్‌'తో పాటు 'యే హై మొహబ్బతే', 'సీఐడీ', 'క్రైమ్‌ పెట్రోల్‌' వంటి సీరియళ్లలోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు న‌టుడు లోకేంద్ర సింగ్ రాజ‌వ‌త్.

రక్తపోటు, తీవ్ర ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి సమస్యల కారణంగా మోకాలి వరకు కాలును తీసేయాల్సి వచ్చింది. నా కుడి పాదంలో చిన్న కణతి ఏర్పడింది. మొదట నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది ఇన్‌ఫెక్షన్‌లా మారి ఎముక మజ్జలోకి వ్యాపించింది. తర్వాత కండరాల్లోని మాంసాన్ని తినేసే గాంగ్రేన్‌ ఎటాక్‌ అయింది. వీటి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి మోకాలి వరకు కాలును తీసేయక తప్పలేదు. నిజానికి పదేళ్ల క్రితం మధుమేహం బారిన పడినప్పుడే నా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఉండుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమో అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇక కొవిడ్ త‌రువాత అవ‌కాశాలు బాగా త‌గ్గాయ‌ట‌. దీంతో ఆర్థికంగా స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. అయితే.. సింటా(సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎంతో కొంత సాయం చేసింద‌ని చెప్పుకొచ్చాడు. కొంత‌మంది నటీనటులు నాకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ మనోధైర్యాన్ని అందిస్తున్నార‌ని చెప్పారు.

Next Story