ప్రముఖ బుల్లితెర నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. షూటింగ్ సెట్‌లో శనివారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో సహ నటుడు షీజాన్ మొహమ్మద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
షీజాన్, తునీషా రిలేషన్‌లో ఉండేవారని, అతడి వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తునీషా తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో షీజాన్ మొహమ్మద్‌పై ఎఫ్ఐఆర్ బుక్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది తునిషా శర్మ. 'భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్' సీరియల్‌లో తొలిసారి నటించింది. 'ఫితూర్', 'బార్ బార్ దేఖో', 'కహానీ 2', దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'అలీబాబా : దస్తాన్-ఎ కాబూల్'లో కీలక పాత్ర పోషిస్తోంది. 20 ఏళ్ల పిన్న వయస్సులోనే తనువు చాలించింది. అయితే.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.