అల్లు అర్జున్‌కు సజ్జనార్ షాక్.. లీగల్ నోటీసులు పంపిన ఆర్టీసీ
TSRTC to send legal notice to Actor Allu Arjun.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ వాణిజ్య ప్రకటన
By తోట వంశీ కుమార్ Published on 10 Nov 2021 2:30 AM GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో టీఎస్ ఆర్టీసీని(తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) కించపరిచేలా నటించడాన్ని నిరసిస్తూ లీగల్ నోటీసు ఇవ్వనున్న ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. బన్ని నటించిన ర్యాపిడో యాడ్‌పై అభ్యంతరాలు వచ్చాయన్నారు. ప్రకటనలో ఏం ఉందంటే.. ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు అల్లు అర్జున్ చెప్పారు.
ఈ ప్రకటనను ఖండిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. టీఎస్ఆర్టీసీని కించపరచడం పట్ల సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రయాణీకులు, అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రజా సేవలో ఉందని.. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలని సజ్జనార్ సూచించారు. టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ నటించిన అల్లు అర్జున్‌కు, ప్రకటనను ప్రచారం చేస్తున్న ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు సజ్జనార్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేశారు.