అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు
TS Government will do Krishnam Raju Funeral Rites.ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం
By తోట వంశీ కుమార్ Published on 11 Sep 2022 7:31 AM GMTప్రముఖ నటుడు కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉంచారు. కృష్ణంరాజు భౌతిక కాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవి కన్నీరుమున్నీరు అయ్యారు. తమ అభిమాన నటుడు కృష్ణంరాజుని చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘరామకృష్ణ రాజు, సీని ప్రముఖులు చిరంజీవి, మోహన్ బాబు తదితరులు నివాళులర్పించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కృష్ణం రాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్త మిత్రుడని కేసీఆర్ అన్నారు. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణం రాజు భౌతిక కాయాన్నిఅభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మృతికి కారణాలు ఇవే..
82 ఏళ్ల కృష్ణం రాజు మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో చనిపోయారు. "రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ బాధపడుతున్నారు. పోస్ట్ కొవిడ్ సమస్యతో గత నెల 5న ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యూమోనియా ఉన్నట్లు గుర్తించాం. కిడ్ని పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణం రాజు మృతి చెందారని" ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.