మరో వివాదంలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమా

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల లిస్ట్‌లో మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ 'గుంటూరు కారం' ఒకటి.

By Srikanth Gundamalla
Published on : 5 Jan 2024 7:22 AM

trivikram, guntur karam movie, controversy, mahesh babu,

మరో వివాదంలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమా 

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల లిస్ట్‌లో మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ 'గుంటూరు కారం' ఒకటి. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్‌ కూడా వచ్చింది. అయితే.. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.

ఈ సినిమా కథను త్రివిక్రమ్ సొంతంగా రాసుకోలేదనీ.. యుద్దనపూడి సోలచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఆ నవల ఆధారంగా తీసింది అయితే.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆ నవలా రచయిత యుద్దనపూడికి క్రెడిట్‌ ఇస్తారా అనే వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు కారం సినిమాకు మొదట్నుంచి కాంట్రవర్సీలే ఎదురవుతున్నాయి. సినిమా అనుకున్న విధంగా మొదలుకాకపోవడం.. మధ్యలో షూటింగ్ డిలే అవ్వడం, ఆ తర్వాత పాటల చుట్టూ వివాదాలు రావడం వంటివి జరిగాయి. తాజాగా ఈ సినిమాను 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగా తీశారన్న వివాదం నడుస్తోంది.

మరోవైపు ఈ సినిమా కథపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించారు. త్రివిక్రమ్‌ను ఉద్దేశిస్తూ ఓ పోస్టు పెట్టారు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అన్నారు. ఈ వివాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు అనీ.. తన తప్పులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్వనారంటూ వ్యాఖ్యానించారు. కొందరు గుడ్డిగా త్రివిక్రమ్‌ను నమ్మేస్తారని పూనమ్ కౌర్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకుని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసిందనీ.. అదెందుకో తనకు ఇప్పటికీ అర్థంకాదని వ్యంగ్యంగా పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.

గతంలో త్రివిక్రమ్‌ 'అ..ఆ..' తీసిన సినిమా కూడా సులోచనారాణి నవల 'మీనా' ఆధారంగా తీసిందే. అయితే.. త్రివిక్రమ్‌ ఈ సినిమా తీసినప్పుడు మొదట యుద్దనపూడికి క్రెడిట్ ఇవ్వలేదు. అందరూ విమర్శలు చేశాక.. సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఆమె పేరు పెట్టి క్రెడిట్ ఇచ్చారు. అయితే.. గుంటూరు కారం సినిమాను నిజంగానే యుద్దనపూడి 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగా తీశారా? ఒక వేళ అది నిజమైతే రచయితకు క్రెడిట్ ఇస్తారా? రెండు కథలు ఒకటేనా? కాదా అన్నది సినిమా విడుదలైతే కానీ తెలియదు. గుంటూరు కారం సినిమాలో మహేశ్‌బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story