ముందే టైమ్ చెప్పేసి, వార్నింగులు ఇచ్చి మరీ పైరసీలో సినిమాలను విడుదల చేయడం తమిళ్ రాకర్స్ ప్రత్యేకత. ఎందరో నిర్మాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ పైరసీ భూతం ఆట కట్టించాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్య పడడం లేదు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే.. 'తమిళ్ రాకర్స్' నేపథ్యంలో అదే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అరవగళన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి సోని లీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ బాషల్లో స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
" 'గరుడ' చిత్రం థియేటర్లలోకి రావడానికి ముందే మీ తమిళ్‌రాకర్స్‌తో హెచ్‌డీ క్వాలిటీతో విడుదల అవుతుంది " అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సినిమాలను ఎలా ఫైరసీ చేస్తారు..? ఆ నెట్ వర్క్ ఏంటి..? ఇలా చేయడం వల్ల తమిళ్ రాకర్స్‌కి వచ్చే లాభం ఏంటి..? ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరు ఉన్నారు..? ఇలాంటి వివరాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. "తమిళ రాకర్స్‌కి వాడే హెడ్" అంటూ అరుణ్ చెప్పిన డైలాగ్ సిరీస్‌పై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఐశ్యర్య మీనన్, పెరుమాళ్, వినోదిని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది.