కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమారై మరణించింది.
వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో మొగిలయ్య తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన రెండో కుమారై రాములమ్మకు 20ఏళ్ల క్రితం నాగర్ కర్నూల్ మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే.. వివాహమైన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటినుంచి ఆమె తండ్రి వద్దే ఉంటోంది.
మంగళవారం గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోతే రాములమ్మ అక్కడికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తండగా.. బీటి రోడ్డుపై జారీ పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను లింగాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండో కుమార్తె మృతితో మొగిలయ్య శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం రాములమ్మ అంత్యక్రియలను నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఫోన్‌లో మొగులయ్యను పరామర్శించారు.