ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) ఇక లేరు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 5:23 AM GMTప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నవంబర్ 11వ తేదీన కన్నుమూశారు. దాంతో.. చిత్రసీమలో విషాదచాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్నారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా చంద్రమోహన్‌కు కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. చంద్రమోహన్ 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 సినిమాలో నటించారు.
చంద్రమోహన్ కృష్ణ జిల్లాలోని పమిడిముక్కలలో జన్మించారు. ఆయన పుట్టిన తేదీ 1943 మే 23. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1966లో రంగులరాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర్ రచయిత్రి. చంద్రమోహన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మధుర మీనాక్షి, మాధవి. ఇద్దరికీ కూడా వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఈమె అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి డాక్టర్. ఈమె ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు.
చంద్రమోహన్ తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఆయన నటనకు గాను ఫలింఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. చంద్రమోహన్‌కు ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 సినిమాలలో నటించారు.
ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్‌తో నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్- సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరగా 2017లో ‘ఆక్సిజన్’ సినిమాలో కన్పించారు. దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్‌కు చంద్రమోహన్ సమీప బంధువు.