సిరి వెన్నెల ఆరోగ్యం ఎలా ఉందంటే..?
Tollywood Lyric writer Sirivennala Seetharama Sastry health is stable.టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల
By తోట వంశీ కుమార్
టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు అన్న సంగతి తెలిసిందే. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారన్న విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆయనకు ఎలా ఉందోనని కంగారు పడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదుట పడింది. గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఆయన చాలా త్వరగా కోలుకుంటారని వెల్లడించారు.
సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో అద్భుతమైన గీతాలు రాశారు సిరి వెన్నెల. ఆయన కలం నుండి జారువాలిన ప్రతి అక్షరం ఆణిముత్యమే. 'సిరివెన్నెల' చిత్రంతోనే ఆయన ఫేమస్ అవడంతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. అదే సినిమాకు ఆయనకు ఉత్తమ లిరికిస్ట్‌గా నంది అవార్డు వచ్చింది. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలకు ఆయన పాటలను రాశారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి.. విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని కూడా కొన్ని పాటలు రాశారు. ఆయన త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.