మళ్లీ టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు
రీసెంట్‌గా డ్రగ్స్ విక్రయిస్తూ నిర్మాత కేపీ చౌదరి పట్టుబడ్డారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 12:14 PM ISTమళ్లీ టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు
ఇటీవల టాలీవుడ్ నిర్మాత కె.పి. చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన్ని పోలీసులు అరెస్ట్ విషయం తెలిసిందే. కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత పలువురు సినీ తారల పేర్లు, వ్యాపారవేత్తల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వినిపిస్తున్నాయి. తాజాగా కొందరు డ్రగ్స్‌లో తమ పేరు వినిపించడంపై స్పందించారు. తమకు కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. ఇదిలా ఉండగా గతంలో కూడా స్టార్ హీరోయిన్స్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.
రీసెంట్‌గా డ్రగ్స్ విక్రయిస్తూ నిర్మాత కేపీ చౌదరి పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తుందనే చెప్పాలి. గతంలో విచారణకు హాజరైనవారితో పాటు.. ఇప్పుడు ఇంకొందరి పేర్లు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి అషురెడ్డితో పాటు సురేఖా వాణి, జ్యోతి పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాదు.. వారు కేపీ చౌదరితో ఉన్న ఫొటోలు కూడా కొన్ని చానెల్స్ చూపించాయి. దీంతో.. వారు వార్తలను తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ కేసుకి తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే అషురెడ్డి ఫోన్ నెంబర్‌ను చూపించారు. దీంతో..ఆమె సీరియస్ అయ్యారు. ఒక వీడియో కూడా విడుదల చేశారు.
డ్రగ్స్‌కేసులో తన పేరు వినిపించడంపై నటి అషురెడ్డి మాట్లాడుతూ.. "కొన్ని చానెల్స్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి నా నెంబర్‌ను ఓపెన్‌గా చూపించి ఇబ్బంది కలిగించారు. చానెల్స్‌లో చెబుతున్నట్లు కేసుకు నాకు ఎంత వరకు సంబంధం ఉందనే విషయం గురించి నేను కూడా మాట్లాడతాను. ఎందుకంటే నా దగ్గర కూడా ఆధారాలున్నాయి. వందల కాల్స్.. గంటల కొద్దీ మాట్లాడానని చెప్పారు. అన్నీ ఒప్పేసుకున్నా టెలికాస్ట్ చేశారు. ఈ వార్తలను నన్ను ఎంతగానో బాధించాయి. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. కాబట్టి నాపై తప్పుగా ప్రచారం చేసినవారిపై కచ్చితంగా పరువునష్టం కేసు వేస్తాను. నా నెంబర్‌ను ఓపెన్‌గా చూపించడం వల్ల.. ప్రతి సెకన్‌కు ఒక కాల్ వస్తోంది. రెండ్రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. ఇక పాత నెంబర్‌ను ఉపయోగించలేను. మున్ముందు కూడా దీనిపై కచ్చితంగా మాట్లాడతాను". అని అషురెడ్డి వీడియోలో చెప్పారు.
ఇక కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు వినిపించడంపై టాలీవుడ్ నటి జ్యోతి కూడా స్పందించారు. తాను ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు. కేపీ చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని.. డ్రగ్స్ డీలింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి విచారణను అయినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు జ్యోతి. ఏ తప్పూ చేయలేదని.. ఎవరికీ.. దేనికీ భయపడాల్సిన అవసరం తనకు లేదని జ్యోతి అన్నారు.
ప్రస్తుతం కేపీ చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది.. విచారణలో కేపీ చౌదరి వెల్లడించే విషయాలను బట్టి ఉంటుంది. కాగా.. రజనీకాంత్ హీరోగా నటించిన సినిమాను తెలుగులో కేపీ చౌదరి విడుదల చేశారు.
స్టార్ హీరోయిన్స్, నటులు, ఇతర సినీ ప్రముఖులు గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో దీపికా పదుకొనె కూడా ఉన్నారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు డ్రగ్స్ కేసుగా టాక్ నడించింది. ఇందులో దీపికా పదుకొనె పేరు వినిపించింది. అప్పట్లో ఆమెను విచారించారు కూడా. రకుల్ కూడా రెండుసార్లు విచారణకు వెళ్లారు. టాలీవుడ్‌లో అయితే.. డ్రగ్స్ కేసులో పదుల సంఖ్యలో నటీనటులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పూరీజగన్నాథ్, చార్మీ, తరుణ్, రానా, రవితేజ, ముమైత్‌ఖాన్‌తో పాటు ఇంకొందరి పేర్లు డ్రగ్స్ కేసులో వినిపించిన విషయం తెలిసిందే.