విషాదం.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Tollywood Director Chandrasekhar Reddy Passes away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పి.చంద్ర‌శేఖ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 5:22 AM GMT
విషాదం.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పి.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 86 సంవ‌త్స‌రాలు. చెన్నైలోని ఆ నివాసంలో ఈరోజు(సోమ‌వారం) ఉద‌యం 8.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. సుమారు 80కి పైగా చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజెండరీ యాక్ట‌ర్ల‌తో ఆయన పని చేశారు. ఆనాటి ప్రముఖ హీరోల అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సంతాన్ని తెలియ‌జేస్తున్నారు.

ఇక చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పి.సి రెడ్డిగా పేరొందిన ఆయ‌న పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. 1933 అక్టోబర్ 14న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రంపేటలో జ‌న్మించారు. కృష్ణ, విజయనిర్మల జంటగా న‌టించిన‌ 'అనూరాధ' చిత్రంతో 1971లో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌రువాత 'భ‌ల్లే అల్లుడు', 'మాన‌వుడు దాన‌వుడు', 'కొడుకులు', 'జ‌గ‌న్నాయకుడు', 'బ‌డిపంతులు', 'విచిత్ర దాంప‌త్యం', 'ర‌గిలే గుండెలు', 'న‌వోద‌యం', 'పాడిపంట‌లు', 'బంగారు కాపురం'. 'రాజ‌కీయ చ‌ద‌రంగం', 'అన్నా వ‌దిన‌', 'పెద్ద‌లు మారాలి'. 'పట్నావాసం', 'అన్నా చెల్లెల్లు', వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎక్కువ‌గా ఆయ‌న‌ సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వహించారు. కృష్ణ హీరోగా 20 చిత్రాల‌ను తెర‌కెక్కించారు. పి.సి.రెడ్డి వ‌ద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు.

Next Story
Share it