నేడు సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ..!
Tollywood celebrities along with Chiranjeevi to meet YS Jagan Today.టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2022 9:52 AM ISTటాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం సమావేశం కానున్నారు. సినిమా టికెట్ల ధరలతో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం సీఎం జగన్‌తో చర్చించనున్నారు. ఈ భేటి అనంతరం టికెట్ ధరల అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రాజమౌళి, డీవీవీ దానయ్య, ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి ఇతర ప్రముఖులు సీఎం కలవనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది.
ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. వారి కోసం ప్రైవేట్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. 3 ఫార్చ్యునర్ వాహనాల్లో వారంతా.. సీఎం జగన్ ను కలవడానికి వెళ్లనున్నారు. ఇక ఈ సమావేశంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తమ కుటుంబం నుంచి చిరంజీవి వెలుతున్నారు కాబట్టి తాను హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. అన్ని విషయాలు చిరంజీవి మాట్లాడతారని చెప్పారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సామాన్యులకు సినిమా టికెట్ ధర అందుబాటులోకి అంటూ థియేటర్ లో టికెట్ ధరలు తగ్గించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సమస్య మొదలైంది. దీనిపై చిత్రపరిశ్రమకు చెందిన వారు అభ్యంతరం తెలుపడంతో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ తమ నివేదిక ఇప్పటికే సీఎంకు అందజేసింది. దీనిపై నేడు చర్చించనున్నారు.