టిక్ టాక్ భార్గవ్.. బాలికకు మాయమాటలు చెప్పి.. గర్భవతిని చేసి..!
TikTok Fame Bhargav Arrested On Rape Case.తాజాగా టిక్ టాక్ భార్గవ్, బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్టు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 20 April 2021 10:02 AM IST
టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో భార్గవ్ కూడా ఒకడు. అంతకు ముందు యుట్యూబ్ లో ఫన్ బకెట్ వీడియోలు చేసే వాడు. ఆ తర్వాత కాస్త పాపులారిటీని సంపాదించుకుని కొన్ని టీవీ షోలలో కూడా కనిపించాడు. తాజాగా టిక్ టాక్ భార్గవ్ మీద తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకూ రిమాండ్ విధించారు.
భార్గవ్ టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. టిక్‌టాక్ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలిక (ఇంటర్మీడియట్ విద్యార్థిని) పరిచయమైంది. తనను కూడా టిక్ టాక్ స్టార్ ను చేస్తానని చెప్పాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గర్భవతి కావడంతో దూరంపెట్టాడు. ఆమె నగరంలోని దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ ప్రేమ్‌కాజల్ కేసు నమోదుచేసి హైదరాబాద్‌లోని భార్గవ్‌ను అరెస్టు చేశారు.
కొత్తవలసకు చెందిన చిప్పాడ భార్గవ్ అలియాస్ 'ఫన్ బకెట్' భార్గవ్ టిక్‌టాక్‌లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. విశాఖ నగరంలోని సింహపురి కాలనీలో తన తల్లితో కలిసి ఉండే మైనర్ బాలికకు టిక్‌టాక్ వీడియోలు చేయడమంటే చాలా ఇష్టం. భార్గవ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. టిక్‌టాక్ వీడియోల ద్వారా పాపులర్ చేస్తానని ఆ బాలికను నమ్మించాడు. ఇద్దరూ అన్నా, చెల్లెలు వరుసతో పిలుచుకునేవారు. కానీ భార్గవ్ మనసులో వేరే ఏదో ఉందని ఆ బాలిక గ్రహించలేకపోయింది. భార్గవ్ ఆమెకు ఏవేవో కబుర్లు చెప్పి ఆమెను నమ్మించాడు. భార్గవ్ మాటలను ఆ బాలిక గుడ్డిగా నమ్మింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ బాలిక గర్భం దాల్చింది. నాలుగు నెలల గర్భం వచ్చే వరకూ బాలిక తల్లి గుర్తించకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్గవ్ తనకు అవకాశాలు వచ్చాయని హైదరాబాద్ వెళ్లాడు. భార్గవ్ పై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భార్గవ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన 'దిశ' పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ లో ఉన్న భార్గవ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేసి.. తీసుకుని వెళ్లారు.