ఇండస్ట్రీ సమస్యలపై నేడు సినీ పెద్దల భేటీ.. ఒకే వేదికపైకి చిరంజీవి, మోహన్ బాబు
Telugu Film Industry 24 crafts Representatives to meet Today.కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలుగు సినీ
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 3:18 AM GMT
కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలుగు సినీ పరిశ్రమ పెద్దల సమావేశం నేడు(ఆదివారం) జరగనుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో పరిశ్రమలోని 24 క్రాఫ్టులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలకు ఆహ్వానాలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల విషయంతో ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలతో పాటు సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
టాలీవుడ్ 24 క్రాఫ్టుల ప్రతినిధుల సమావేశానికి మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై సమస్యలపై చర్చించనున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి నేతృత్వంలో పలువురు హీరోలు, దర్శకుల సమావేశానికి ముందే ఈ భేటీ జరగాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు ఈ సమావేశం జరగనుంది. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వంతో చర్చలపై రెండుగా విడిపోయిన టాలీవుడ్ పెద్దలు ఈ భేటీలో కలవనుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.