మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ జీవితంలోకి మరొకరు రాబోతున్నట్టు తెలియజేస్తూ వరుణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జీవితంలో అత్యంత అందమైన పాత్రలోకి అడుగుపెడుతున్నామని పేర్కొంటూ లావణ్య చేతితో పాటు పిల్లల షూను పట్టుకొని ఉన్న ఫొటోనే ఆయన షేర్ చేశారు. దీంతో వీరిద్దరికీ అభిమానులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి, శ్రీనివాస్ బెల్లంకొండ, అదితి రావు హైదరిలతో పాటు పలువురు ప్రముఖులు శుభకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు కూడా వ్యాఖ్యల విభాగాన్ని అభినందన సందేశాలతో నింపారు.
ఐదు సంవత్సరాలకు పైగా డేటింగ్ తర్వాత వీరి వివాహం నవంబర్ 1,2023లో జరిగింది. ఇటలీలోని టస్కానీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమా సెట్స్‌లో కలిశారు. ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టి జూన్ 2023లో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. 'మిస్టర్' కాకుండా, వారు 2018లో విడుదలైన 'అంతరిక్షం 9000 KMPH' అనే మరో తెలుగు సినిమాలో కూడా నటించారు.