'ఎమర్జెన్సీ' మూవీపై తెలంగాణ సర్కార్‌ నిషేధం?

'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు.

By అంజి
Published on : 30 Aug 2024 10:30 AM IST

Telangana government, movie, Emergency movie, Kangana Ranaut

'ఎమర్జెన్సీ' మూవీపై తెలంగాణ సర్కార్‌ నిషేధం? 

హైదరాబాద్: కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) మాజీ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో షబ్బీర్‌ను కలిసి "ఎమర్జెన్సీ" స్క్రీనింగ్‌పై నిషేధం విధించాలని అభ్యర్థించింది.

18 మంది సభ్యుల ప్రతినిధి బృందం.. సినిమాలో సిక్కు సమాజాన్ని తప్పుగా చిత్రీకరించారని పేర్కొంటూ, ఈ సినిమాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక రిప్రజెంటేషన్‌ను సమర్పించినట్లు షబ్బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించారని, ఇది "ఆక్షేపణీయమైనది", సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించిందని ప్రతినిధి బృందం ఆరోపించింది.

తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు షబ్బీర్ రెడ్డిని కలిసిన సమాచారం.

Next Story