తెలంగాణలో ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 13 Jun 2023 8:04 PM IST
తెలంగాణలో ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి మూడ్రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచేందుకు ఓకే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు.. మొదటి మూడ్రోజుల పాటు ఆరో షో ప్రదర్శించేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ధరలు పెంచడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉదయం 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించుకోవచ్చు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు దీనికి అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇక త్రీడీలో ప్రదర్శించే స్కీన్స్‌లో అయితే గ్లాసెస్ కోసం అదనంగా చెల్లించాలి. కాగా ఈ నెల 16 ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సీత పాత్రలో నటించారు. ఓం రౌత్ డైరెక్షన్‌లో భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదిపురుష్ సినిమాకు టికెట్ ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా రూ.50 పెంచనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, అగ్ర హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం రోజుల పాటు థియేటర్లలో టికెట్ ధరలు పెంచుతున్న విషయం తెలిసిందే.