సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రభుత్వం రూ.కోటి నజరానా
సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు.
By అంజి
సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రభుత్వం రూ.కోటి నజరానా
సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. స్వయంకృషితో హైదరాబాద్ నుంచి ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్‌ను గౌరవిస్తామని సీఎం రేవంత్ గతంలో అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల గద్దర్ అవార్డుల కార్యక్రమంలోనూ సింగర్‌కు ఏదైనా కానుక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని సీఎం రేవంత్ కోరారు. రాహుల్‌కు గద్దర్ అవార్డు దక్కలేదని, అయితే అతడి ప్రతిభకు తగ్గ అవార్డు లేదా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఇవాళ పాతబస్తీ బోనాల సందర్భంగా ఆయనకు రూ.కోటి కానుక ప్రకటించారు. 'నాటు నాటు', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి', 'రంగా రంగా రంగస్థలానా', 'వాస్తు బాగుందే', 'కాలేజ్ బుల్లోడా' వంటి హిట్ సాంగ్స్ ఎన్నో రాహుల్ పాడారు. బోనాలు, వినాయక చవితి పండుగలకు ప్రత్యేక పాటలతో మ్యూజికల్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నారు. 'రంగమార్తాండ' సినిమాతో తనలోని నటుడిని కూడా రాహుల్ బయటపెట్టుకున్నారు. అటు తెలుగు బిగ్‌బాస్-3 టైటిల్‌ను కూడా రాహుల్ గెల్చుకున్నారు.