హెల్త్ బులెటిన్‌.. అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

Taraka Ratna Health Bulletin Released.సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 3:13 PM IST
హెల్త్ బులెటిన్‌.. అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల ఆస్ప‌త్రి వెల్ల‌డించింది. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేసింది. ప్ర‌త్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 1 గంట‌కు కుప్పం నుంచి ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చార‌ని ఆ బులిటెన్‌లో పేర్కొంది.

కార్డియాల‌జిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇత‌ర స్పెష‌లిస్ట్‌లు తార‌క‌ర‌త్న ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉంది. ట్రీట్‌మెంట్ కొన‌సాగుతోంది. పూర్తిగా వైద్య‌సాయంపైనే ఆధార‌ప‌డి ఉన్నారు. మ‌రికొన్ని రోజులు ఆరోగ్య ప‌రిస్థితిపై నిశిత ప‌రిశీలన, చికిత్స కొన‌సాగుతాయి. ఈ స‌మ‌యంలో తార‌క‌ర‌త్న‌ను చూసేందుకు ఎవ‌రూ రావొద్దు. చికిత్సకు ఆటంకం క‌లిగించ‌వ‌ద్ద‌ని ఆ బులిటెన్‌లో నారాయ‌ణ హృద‌యాల ఆస్ప‌త్రి తెలిపింది.


నిన్న(శుక్ర‌వారం) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించ‌గా ఈ పాదయాత్రలో తార‌క‌ర‌త్న పాల్గొన్నారు. కొద్ది దూరం న‌డిచిన అనంత‌రం తార‌క‌ర‌త్న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. వెంట‌నే ఆయ‌న్ను కుప్పంలోని కేసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి సీపీఆర్ చేయించారు. ఆ త‌రువాత పీఈఎస్ వైద్య క‌ళాశాల‌కు తీసుకువెళ్లారు. గుండెనాళాల్లో ర‌క్తం పేరుకుపోయింద‌ని గుర్తించి అందుకు త‌గ్గ చికిత్స అందించారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు తార‌క‌ర‌త్న కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను రాత్రి అంబులెన్స్‌లో బెంగ‌ళూరుకు త‌ర‌లించారు.

Next Story