ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి.. తమిళ నటిపై కేసు

కేర‌ళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో త‌మిళ‌ నటి లక్ష్మీ మీనన్‌ను నిందితురాలిగా పోలీసులు చేర్చారు

By Knakam Karthik
Published on : 28 Aug 2025 7:45 AM IST

Cinema News, Tamil actor Lakshmi Menon, Kidnap Case, Assault case of IT professional

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి.. తమిళ నటిపై కేసు

కేర‌ళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో త‌మిళ‌ నటి లక్ష్మీ మీనన్‌ను నిందితురాలిగా పోలీసులు చేర్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. కేరళలోని ఎర్నాకులం నార్త్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నార్త్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. వారిలో ఒకరు నటి స్నేహితురాలు. బెనర్జీ రోడ్డులోని ఒక బార్‌లో ఈ వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత, నటి లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు బాధితుడిని వెంబడించి, అతడి కారును అడ్డగించారు. ఆ తర్వాత అతడిని బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో మిథున్, అనీష్, సోనామోల్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్ల‌డించారు.

‘కుంకి’, ‘జిగర్తాండ’, ‘వేదాలంస‌ వంటి విజయవంతమైన తమిళ చిత్రాలతో లక్ష్మీ మీనన్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ సరసన నటించిన ‘ఇంద్రుడు’ సినిమాతో తెలుగులోనూ ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి నటి కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Next Story