'ది కేరళ స్టోరీ': వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
By అంజి Published on 18 May 2023 12:45 PM GMT'ది కేరళ స్టోరీ': వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ సినిమా బ్యాన్ విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజల అసహనానికి అనుగుణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ మే 8న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం, 'ది కేరళ స్టోరీ'ని సురక్షితంగా ప్రదర్శించడానికి ప్రతి సినిమా హాల్‌కు తగిన భద్రత కల్పించాలని, సినిమా ప్రేక్షకుల భద్రతను కల్పించాలని, అలాగే రాష్ట్రం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రదర్శనను అడ్డుకోవద్దని తమిళనాడును ఆదేశించింది.
దేశంలో అన్ని చోట్లా సినిమా విడుదలైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. "సీబీఎఫ్‌సీ కేరళ స్టోరీ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఏమైనా అల్లర్లు జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా అయితే ఏదో ఓ కారణం అడ్డం పెట్టుకుని అన్ని సినిమాలనూ బ్యాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఫిల్మ్ మేకర్స్‌కి కూడా మేం చెప్పేదొకటే. సినిమాకు ముందు ఓ డిస్‌క్లెయిమర్ వేయండి. మీరు చెబుతున్న ఆ 32 వేల సంఖ్య కేవలం ఊహాజనితమని, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక డేటా లేదని చెప్పండి" అని సుప్రీంకోర్టు పేర్కొంది.