మాటలకు అందని విషాదం ఇది.. ప్ర‌ముఖుల సంతాపం

Superstar Krishna passes away Megastar Chiranjeevi to Nani celebs remember the legend.సూపర్ స్టార్ కృష్ణ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 3:26 AM GMT
మాటలకు అందని విషాదం ఇది.. ప్ర‌ముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ క‌న్నుమూశారు. కార్డియాడ్ అరెస్ట్‌తో సోమ‌వారం రాత్రి కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయ‌న ఇక లేరు అనే వార్త తెలిసి కుటుంబ స‌భ్యులు, అభిమానులతో పాటు సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయ‌న మృతికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

సూప‌ర్ కృష్ణ మృతి ప‌ట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. విభిన్న కుటుంబ క‌థాచిత్రాల‌తో పాటు ప్ర‌జ‌ల‌కు సామాజిక స్పృహ క‌లిగించే సాంఘీక చిత్రాల న‌టుడిగా కృష్ణ జ‌నాద‌ర‌ణ పొందారు. నాటి కార్మిక‌, క‌ర్ష‌క లోకం ఆయ‌న్ను త‌మ అభిమాన హీరోగా, సూప‌ర్‌స్టార్‌గా కీర్తించేవార‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినీ రంగంలో కొత్త ఒర‌వ‌డుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త కృష్ణ‌దేన‌ని కేసీఆర్ కొనియాడారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సీఎం త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

కృష్ణ మృతి ప‌ట్ల ఏపీ సీఎం జ‌గ‌న్ సంతాపం తెలియ‌జేశారు. కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు.మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అని సీఎం జ‌గ‌న్ అన్నారు.

మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Next Story