శోక సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. సూప‌ర్ స్టార్ కృష్ణ క‌న్నుమూత‌

Super Star Krishna passes away at the age of 79.సూప‌ర్ కృష్ణ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 2:23 AM GMT
శోక సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌.. సూప‌ర్ స్టార్ కృష్ణ క‌న్నుమూత‌

సినిప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. సూప‌ర్ కృష్ణ క‌న్నుమూశారు. ఆదివారం రాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణ‌ను కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 79 సంవ‌త్స‌రాలు. సూప‌ర్ స్టార్ ఇక లేరు అనే వార్త తెలిసి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు, తెలుగు సినిలోకం శోక సంద్రంలో మునిగిపోయింది.

గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942 మే 31 కృష్ణ జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఆయ‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల‌పై ఎంతో ఆస‌క్తి ఉండేది. దీంతో సినీ రంగంవైపు అడుగులు వేశారు. 1964లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెర‌కెక్కించిన "తేనె మ‌న‌సులు" చిత్రంతో కృష్ణ సినీ ప్రయాణం మొద‌లైంది. అయితే.. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కృష్ణ న‌ట‌న బాగోలేద‌ని, ఆయ‌న్ను ఈ చిత్రం నుంచి తొల‌గించాల‌ని ప‌లువురు ద‌ర్శ‌కుడిపై ఒత్తిడి తెచ్చారు. అయినా.. ఆదుర్తి సుబ్బారావు త‌న నిర్ణ‌యం మార్చుకోలేదు. 1965లో విడుద‌లైన తేనె మ‌న‌సులు చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

"గూఢ‌చారి 116" చిత్రం కృష్ణ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. తెలుగు ప్రేక్ష‌కులు ఆయ‌న్ను ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఒక ఏడాదిలో ప‌దుల సంఖ్య‌లో ఆయ‌న సినిమాలు విడుద‌ల అయ్యేవి. ఓ ద‌శ‌లో కృష్ణ రోజుకు మూడు షిప్టుల్లో ప‌ని చేసేవారు. ఇలా ఆయ‌న సినీ ప్ర‌స్థానం నాలుగు ద‌శాబ్ధాల పాటు సాగింది. 340కు పైగా చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. 1970లో ప‌ద్మాల‌య పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ప‌లు చిత్రాల‌ను తెర‌కెక్కించారు. కొత్త జాన‌ర్‌లు, సాంకేతిక‌త‌లు ప‌రిచ‌యం చేశారు.

కుటుంబం..

1965లో ఇందిర‌ను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, ప్రియ‌ద‌ర్శిని, మంజుల‌. ఆ త‌రువాత సినీ న‌టి ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల‌ను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ర‌మేష్ బాబు, మ‌హిషేబాబు సినీ రంగంలో అడుగుపెట్టారు. ర‌మేష్ బాబు హీరోగా అనుకున్న స్థాయిలో రాణించ‌క‌పోయినా.. తండ్రికి త‌గ్గ వార‌సుడిగా మ‌హేష్‌బాబు నిలిచారు. ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లలో టాప్ హీరోల్లో మ‌హేష్‌బాబు ఒక‌రు.

Next Story