జైలు నుంచి జాక్వెలిన్‌కు ప్రేమ లేఖ, గిఫ్ట్‌గా ప్రైవేట్ జెట్..రాసిందెవరో తెలుసా?

వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ లవ్ లెటర్ రాశాడు.

By Knakam Karthik  Published on  14 Feb 2025 6:18 PM IST
Cinema News, Entertainment, Sukesh-Chandrasekhar, Jacqueline Fernandez, Love-Letter

జైలు నుంచి జాక్వెలిన్‌కు ప్రేమ లేఖ, గిఫ్ట్‌గా ప్రైవేట్ జెట్..రాసిందెవరో తెలుసా?

వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ లవ్ లెటర్ రాశాడు. ఆర్థిక మోసాల కేసులో అరెస్టయిన సుఖేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. జైలు నుంచే అతడు జాక్వెలిన్ కు లవ్ లెటర్ రాశాడు. మరో జన్మంటూ ఉంటే నీ హృదయంలా జన్మిస్తానని పేర్కొన్నాడు. అంతే కాదు ఆమెకు ప్రైవేట్ జెట్‌ను కూడా కానుకగా ఇస్తున్నట్లు తెలిపాడు. " బేబీ.. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ సంవత్సరం మనకు ఎంతో సానుకూలంగా, ప్రత్యేకమైన విషయాలతో ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా.

వృత్తిపరమైన పనుల రీత్యా నువ్వు వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటావు. అందుకే నీకు ఒక ప్రైవేట్ జెట్‌ కానుకగా ఇస్తున్నా. నీ పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్‌పై రాసి ఉంటాయి. అదే విధంగా నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నా. ఈ జెట్‌లో ఇకపై నీ ప్రయాణాలు సౌకర్యంగా జరుగుతాయి. నాకున్న కోరిక ఒక్కటే నాకంటూ మరో జన్మ ఉంటే.. నీ హృదయంగా పుట్టాలని ఉంది. ఆవిధంగా నీ గుండె చప్పుడు అవుతా. నీలాంటి అందమైన, అద్భుతమైన మనిషిని ప్రియురాలిగా కలిగి ఉన్నందుకు ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే" అని సుఖేశ్ రాసుకొచ్చాడు.

మోసగాడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ 2015 నుండి జైలులో ఉన్నాడు. కోట్ల రూపాయల మోసం కేసులో అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సమయంలో, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సంబంధం బయటపడింది. ఈ క్రమంలోనే అతడు జాక్వెలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె తన ప్రియురాలని పేర్కొన్నాడు. మరోవైపు సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్ను నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఇంత జరిగినా సుఖేశ్ మాత్రం జాక్వెలిన్‌కు జైలులో నుంచే ప్రేమ లేఖలు రాస్తున్నాడు.

Next Story