సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. పై నుంచి కింద‌ప‌డి సంట్ మాస్ట‌ర్ సురేష్ మృతి

Stunt master falls to death after rope snaps on film set.సినిమా షూటింగ్‌లో అప‌శృతి చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2022 11:12 AM IST
సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. పై నుంచి కింద‌ప‌డి సంట్ మాస్ట‌ర్ సురేష్ మృతి

సినిమా షూటింగ్‌లో అప‌శృతి చోటు చేసుకుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా స్టంట్ మాస్ట‌ర్ సురేష్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న చెన్నై శివార్ల‌లో చోటు చేసుకుంది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్, హీరో సూరి కాంబినేష‌న్‌లో 'విడుద‌లై' అనే త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది.ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ చైన్నై శివార్ల‌లో జ‌రుగుతోంది. వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో సన్నివేశం కోసం రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురైన‌ట్లుగా చిత్రీకరిస్తున్నారు.

శనివారం ఉదయం సురేష్‌తో సహా కొంతమంది నటులను భారీ క్రేన్‌కు బిగించి తాళ్లతో కట్టివేశారు. అయితే.. ప్ర‌మాద‌వ‌శాత్తు సురేష్‌కు క‌ట్టిన తాడు తెగిపోయింది. దాదాపు 20 అడుగుల పై నుంచి కింద ప‌డ‌డంతో అత‌డికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. ఆయ‌న్ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సురేష్ మృతితో తమిళ‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు న‌టీన‌టులు ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story