తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబం, 'జవాన్‌' మూవీ టీంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

By అంజి  Published on  5 Sept 2023 8:25 AM IST
Shah Rukh Khan, Suhana Khan, Nayanthara, Tirupati temple, Jawan

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్ 

బాలీవుడ్‌ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'జవాన్'. భారీ హైప్, అంచనాల మధ్య సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో విడుదల కానుంది. భారత్‌లోని 3 ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్‌లలో 'జవాన్' ఇప్పటివరకు 3 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించింది. 'జవాన్' గ్రాండ్ రిలీజ్ కు ముందు ఈ ఉదయం షారుక్ తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్, జవాన్ సహనటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, జవాన్ దర్శకుడు అట్లీ తదితరులు మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామికి పూజలు చేశారు. షారుఖ్‌ మేనేజర్ పూజా దద్లానీ కూడా వారితో పాటు వచ్చారు.

షారూఖ్ తిరుమలకు రావడం ఇదే తొలిసారి. 'పఠాన్' తర్వాత వస్తున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ మళ్లీ ట్రాక్‌లోకి చాలా ప్రచారం జరుగుతోంది. భారత్‌లో 'జవాన్' అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ప్రారంభమై మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. గత వారం వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఆశీస్సులు కోరిన తర్వాత, 'జవాన్' విడుదలకు ముందు ఆశీర్వాదం కోసం ఎస్ఆర్‌కే ఈరోజు తిరుపతికి వెళ్లారు. సుహానా ఖాన్‌తో కలిసి ప్రత్యేక దర్శనం కోసం ఆయన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

'జవాన్' సెప్టెంబర్ 7, 2023న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది. ఇందులో షారూఖ్ ఖాన్‌తో పాటు విజయ్ సేతుపతి, నయనతార, సన్యా మల్హోత్రా, ప్రియమణి నటించారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్, దొంగగా. పూణె, ముంబయి, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్, ఔరంగాబాద్‌లో చిత్రీకరణ జరిగింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దీంతో బాలీవుడ్‌లో సోలో కంపోజర్‌గా తన తొలి అరంగేట్రం చేయనున్నాడు.

Next Story