కరోనా కష్టకాలంలో సామాన్యులకు నేనున్నాను అంటూ అండగా నిలబడ్డాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ వేషాలు వేసిన నిజ జీవితంలో హీరోగా నిలిచాడు. ఎంతో మందిని ఆదుకున్నాడు. అడిగిన వారికి లేదనకుండా ఇప్పటికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా కరోనా మందులను అడిగిన వారికి కూడా తక్షణమే సాయం చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాడు సోనూ.
అయితే.. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నా.. ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండి పోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం. దీనిని గమనించిన సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రాన్స్ సహా ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేయనున్నారు.
ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. ''ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం..'' అని సోనూసూద్ చెప్పారు.