కరోనా కష్టకాలంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ రియల్ హీరో అని నిరూపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఆయన చేస్తున్న మంచి పనులను అందరూ మెచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు బస్సులను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపిచాడు. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చాడు. సాయం చేయమని అడిగిందే తడువుగా.. లేదనకుంటూ తన వంతు సాయాన్ని అందిస్తూ ప్రజల మన్నలను పొందాడు. తెలంగాణలోని ఓ ఊరిలో ఇటీవల సోనూసూద్‌కు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. సేవా కార్యక్రమాలతో ప్రతి రోజు వార్తలలో నిలుస్తూ వస్తున్న సోనూసూద్ రీసెంట్‌గా ఆచార్య సిబ్బందికి మొబైల్స్ బహుమతిగా ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి.. ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. ఇటీవల కొన్ని వ్యాన్స్‌ను కొనుగోలు చేసిన సోనూసూద్.. వాటిని అంబులెన్స్‌లుగా మార్చి ప్రజలకు సాయపడేందుకు సిద్దమయ్యాడు. 'సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్' పేరుతో మంగళవారం వీటిని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఏరియాలో ప్రారంభించారు. రానున్న రోజులలో వీటిని మరింత విస్తృతం చేస్తామని అంటున్నాడు. దీనిపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.