కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సాయం అని అడిగిన వెంటనే లేదనకుండా తనకు చేతనైనా సాయం చేస్తున్నాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఆపద్భాంధవుడిగా మారాడు. పేదవారికే కాదు సెలబ్రెటీలకు సైతం సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం సాయం అంటే గుర్తుకు వచ్చేది సోనూసూద్ మాత్రమే. అంతలా ఆదుకుంటున్నాడు. రాష్ట్రం, భాషతో సంబంధం లేకుండా ఎంతో మందిని ఆదుకున్నాడు.
అయితే.. కొద్ది మంది ప్రస్తుతం సోనూసూద్ పేరును వాడుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో నకిలి వెబ్ సైట్లు క్రియేట్ చేస్తూ కొందరు కేటుగాళ్లు.. అందినకాడికి దోచుకుంటున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ తమ నంబర్లు ఇచ్చి విరాళాలను కొట్టేస్తున్నారు. సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మొదలు మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఒక డిజైన్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. అందులో ఒక ఫోన్ పే నంబర్ కూడా ఇచ్చారు. ఇటీవల అలాంటి లింకులు చాలామందికి వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు విషయం తెలియని చాలామంది ఆ ఫోన్ నెంబర్లకు సాయం చేసి ఉండొచ్చు.
ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ నకిలీ పోస్టును షేర్ చేస్తూ వార్నింగ్ అని హెచ్చరించారు. అది ఫేక్ ఫౌండేషన్ అని, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక తాను ఎవ్వరి నుంచి నేరుగా ఆర్థిక సాయం ఆశించడం లేదని ప్రత్యేక సందేశం పంపాడు.