కొరియోగ్రాఫ‌ర్ శివశంకర్ మాస్టర్‌కు అండగా సోనూసూద్

Sonu Sood helping Shiva Shankar Master.ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 11:59 AM IST
కొరియోగ్రాఫ‌ర్ శివశంకర్ మాస్టర్‌కు అండగా సోనూసూద్

ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మహ‌మ్మారి కార‌ణంగా మాస్ట‌ర్ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్ష‌న్ సోక‌గా.. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆయ‌న్ను ర‌క్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కాగా.. ఆయ‌న కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న కారణంగా దాత‌లు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ కోరారు. సోష‌ల్ మీడియా ద్వారా విష‌యం తెలుసుకున్న బాలీవుడ్ సినీ న‌టుడు సోనూసూద్ వెంట‌నే స్పందించారు.

శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే వారి కుటుంబంతో మాట్లాడాన‌ని.. మాస్ట‌ర్ ను కాపాడేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సోనూసూద్‌ తెలిపారు.

హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో గ‌త నాలుగు రోజులుగా శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ చికిత్స పొందుతున్నారు. ఆయ‌న భార్య, పెద్ద కుమారుడికి సైతం క‌రోనా సోకింది. పెద్ద కొడుకు అప‌స్మార‌క స్థితిలో ఉండ‌గా.. భార్య హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా దాదాపు 10 బాష‌ల్లో కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 800 చిత్రాల‌కు పైగా డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌నిచేశారు. దర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'మ‌గధీర' చిత్రంలో 'ధీర.. ధీర‌..' పాట‌కు గానూ 2011లో శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు జాతీయ పుర‌స్కారం ల‌భించింది. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానే కాకుండా ప‌లు చిత్రాల్లో న‌టుడిగానూ క‌నిపించారు. బుల్లితెర‌పై ప‌లు డ్యాన్స్ షోల‌కు జ‌డ్జీగానూ వ్య‌వ‌హ‌రించారు.

Next Story