మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌..నాలుగు నెలల బాబుకు గుండె ఆపరేషన్

Sonu sood bears costs of heart surgery of 4 month old baby .. మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌..నాలుగు నెలల బాబుకు

By సుభాష్  Published on  13 Nov 2020 10:54 AM IST
మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌..నాలుగు నెలల బాబుకు గుండె ఆపరేషన్

సినీ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ మరో దాతృత్వం చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న నాలుగు నెలల బాలుడికి శస్త్ర చికిత్స చేయించేందుకు ముందుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గరావుపల్లికి చెందిన పందిపల్లి బాబు-రజితకు నాలుగు నెలల వయసున్న కొడుకు ఆదిత్యశౌర్య ఉన్నాడు. నెల రోజుల కిందట బాలుడు అనారోగ్యానికి గురికావడంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రితో చూపించారు. వైద్యులు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించగా, నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా, చిన్నారికి గుండె జబ్బు ఉందని, శస్త్ర చికిత్సకు రూ.7.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత ఖర్చుతో శస్త్ర చికిత్స చేయించే స్థోమత లేక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

బాలుడి తండ్రి బాబు కొరియర్‌ ఆఫీస్‌లో, తల్లి రజిత కూలీ పని చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. గ్రామస్తుల సహాయంతో బాబు దంపతులు వేములవాడ టీఆర్‌కే ట్రస్టును ఆశ్రయించారు. బాలుడికి చికిత్స కోసం దాతలు సాయం చేయాలని ట్రస్టు వారు ట్విట్టర్‌లో కోరారు. ఆ పోస్టును చూసిన నటుడు సోనూసూద్‌ స్పందించారు. బుధవారరం బాబు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బాలుడి గుండె ఆపరేషన్‌ కోసం అయ్యే ఖర్చు తాను భరిస్తానని, హైదరాబాద్‌లోని ఇన్నోవా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సాయం చేసిన సోనూసూద్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బాధిత కుటుంబానికి భరోసా ఉంటాననని ప్రకటించారు.

Next Story