నటి, హర్యానా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు సోనాలి ఫోగట్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే సోనాలి ఫోగట్ మరణంపై ఆమె సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరి మరణం అనుమానాస్పదంగా ఉందన ఆమె పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే సొనాలి ఫోగట్ తీవ్ర అనారోగ్యానాకి గురయ్యారని ఆమె సోదరి ఆరోపించారు.స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన ఆమె సోమవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. చనిపోయే ముందు సోనాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆహారం తిన్న తర్వాత అసౌకర్యంగా ఉందని చెప్పారని, తన ఆహారంలో కొందరు ఏదో కలిపారని అనుమానం వ్యక్తం చేశారని.. ఆమె సోదరి వెల్లడించారు.
అయితే సొనాలి ఫోగట్ మరణంలో అనుమాస్పదంగా ఏం కనబడట్లేదని పోలీసులు తెలిపారు. టీవీ యాంకర్, నటిగా 2006లో కెరీర్ ఆరంభించారు సోనాలి ఫోగట్. టిక్‌టాక్ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 14వ సీజన్‌లో ఆమె కనిపించింది. వైల్డ్‌కార్డ్‌తో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓటమిపాలైయ్యారు. కాగా.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.