హీరో విజయ్‌పై చెప్పు విసిరిన దుండగుడు.. వీడియో వైరల్

హీరో విజయ్‌ గురువారం రాత్రి విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పించారు.

By Srikanth Gundamalla  Published on  29 Dec 2023 5:38 PM IST
slipper, attack,   hero vijay, kollywood ,

 హీరో విజయ్‌పై చెప్పు విసిరిన దుండగుడు.. వీడియో వైరల్ 

డీఎండీకే అధినేత, ఒకప్పటి తమిళ స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై తమిళనాడులో విషాదం నెలకొంది. విజయ్‌కాంత్‌ మృతిపై కోలీవుడ్‌ ఒక్కటే కాదు.. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు విజయ్‌కాంత్‌ను కడసారి చూసి.. నివాళులు అర్పించేందుకు భారీగా వెళ్లారు. గురువారం రాత్రి పలువురు ప్రముఖులు విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌కి చేదు అనుభవం ఎదురైంది.

హీరో విజయ్‌ గురువారం రాత్రి విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో అనుకోని సంఘటన ఎదురైంది. అక్కడే చాలా మంది జానాలు ఉన్నారు. వారి మధ్య నుంచే విజయ్‌ కారు వద్దకు వెళ్లారు. గుంపులో నుంచి ఎవరో ఒక వ్యక్తి చెప్పును విసిరాడు. ఆ చెప్పు నేరుగా విజయ్‌ వైపే దూసుకొచ్చింది. కానీ.. ఆయన కొంచెం ముందుకు కదలడంతో ఆ చెప్పు గురితప్పి వెనుకాల నుంచి వెళ్లిపోయింది. దాంతో.. అక్కడున్న పోలీసులు, బౌన్సర్లు విజయ్‌కి రక్షణగా వచ్చి కారులో ఎక్కించారు. కాస్త ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి.

విజయ్‌పైకి చెప్పు విసిరిన దృశ్యాలు వీడియో రికార్డు అయ్యింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను విజయ్‌ అభిమానులతో పాటు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు గుంపులో గోవిందలా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారనీ.. వీరిని ఊరికే వదిలేస్తే ఇలాంటి అనుభవమే మరొకరికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అందుకే ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇక విజయ్‌ అభిమానులు అయితే.. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story