భర్తను అవమానించిన నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన సునీత
Singer Sunitha counters a netizen who trolled her husband.సింగర్ సునీత.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By తోట వంశీ కుమార్
సింగర్ సునీత.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్‌లలో సునీత ఒకరు. ఆమె పాటలకు చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇక సునీత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మయా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన భర్త రామ్ వీరపనేనితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే.. తన భర్తను కించపరుస్తూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ధీటుగా ఘాటుగా సమాధానమిచ్చింది.
సునీత, రామ్ వీరపనేని దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని ఆలయానికి వెళ్లారు. అక్కడ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని సునీత, ఆమె భర్త రామ్ సందర్శించారు. ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ ఫోటోను పంచుకున్నారు. దీనిపై ఓ వ్యక్తి.. 'కాకి ముక్కుకు దొండపండు, సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం.. ధనము ఆయన సొంతం! గానం ఈవిడది, దర్జా అతనిది!' అంటూ కామెంట్ చేశాడు.
అది చూసిన సునీత.. 'నోటి దూల నీది, నీ భారం భూమిది' అని అతడి స్టైల్‌లోనే కౌంటర్ ఇచ్చింది. సునీత ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భలే సమాధానం చెప్పావు అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.