శింబు భావోద్వేగం..ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు.. మీరే న‌న్ను చూసుకోవాలి

Simbu cries at Maanaadu press meet.త‌మిళ హీరో శింబు స్టేజ్‌పైనే క‌న్నీరు పెట్టుకున్నాడు. త‌న‌ను కొంద‌రు కావాల‌నే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 4:43 AM GMT
శింబు భావోద్వేగం..ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు.. మీరే న‌న్ను చూసుకోవాలి

త‌మిళ హీరో శింబు స్టేజ్‌పైనే క‌న్నీరు పెట్టుకున్నాడు. త‌న‌ను కొంద‌రు కావాల‌నే ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని స్టేజీ మీద‌నే త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు. శింబు న‌టించిన తాజా చిత్రం 'మానాడు'. వెంక‌ట్‌ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నిన్న‌(గురువారం) రాత్రి చెన్నైలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడ‌క‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను పంచుకుంటూనే హీరో శింబు భావోద్వేగానికి గురైయ్యాడు.

తాను, వెంకట్‌ ప్రభు కలిసి ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాల‌నుకున్నామ‌ని.. ఇప్ప‌టికి కుదిరింద‌న్నారు. చిత్రం అద్భుతంగా వ‌చ్చింద‌న్నాడు. ఈ చిత్రంలో వినోదానికి కొద‌వ లేద‌ని.. సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఎస్‌జే సూర్య కూడా అద్భుతంగా న‌టించార‌ని.. సినిమా విడుద‌ల అయ్యాక ఆయ‌న స్థాయి ఎంతో పెరుగుతుంద‌న్నాడు. ఇలా అప్ప‌టి వ‌ర‌కు ఎంతో స‌ర‌దాగా మాట్లాడిన శింబు ఒక్క‌సారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు.

ఇటీవల కొందరు నాకు సమస్యలు సృష్టిస్తున్నారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాటన్నింటినీ నేను చూసుకోగలను. కానీ నన్ను మాత్రం మీరే (అభిమానులు) చూసుకోవాలి అంటూ స్టేజీ మీద‌నే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపైకి వ‌చ్చి శింబును ఓదార్చారు. కాగా.. శింబు ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌మ అభిమాన న‌టుడు స్టేజీ మీద‌నే క‌న్నీరు పెట్టుకోవ‌డంతో అభిమానులు శింబుకి మ‌ద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story
Share it