నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల కాంట్రవర్సీపై స్పందించిన రానా

సాధారణంగా సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని రానా అన్నారు.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2023 4:46 PM IST
SIIMA Awards, Rana, National Film awards, controversy,

నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల కాంట్రవర్సీపై స్పందించిన రానా

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ సినిమా అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. బెస్ట్‌ యాక్టర్ కేటగిరీలో అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర లిఖించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే ఏకంగా ఆరు అవార్డులు లభించాయి. ఉప్పెన సినిమాకు బెస్ట్‌ తెలుగు సినిమా అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే సూర్య హీరోగా నటించిన 'జై భీమ్‌' చిత్రానికి జాతీయ అవార్డుల్లో స్థానం దక్కలేదు. ఆ సినిమా ఎంతో బాగుంటుంది.. సామాజికంగా తీసిన సినిమా కావడంతో అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ.. జాతీయ అవార్డులు ఒక్కటీ రాకపోవడంతో నిరాశ చెందారు. అభిమానులే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కొందరు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరికాదంటూ పలువురు కాంట్రవర్సీకి దారి తీశారు. కొద్దిరోజుల పాటు సోషల్‌ మీడియా మొత్తం ఇదే విషయంపై రచ్చ జరిగింది. తాజాగా దీనిపై యాక్టర్‌ రానా దగ్గుబాటి కూడా స్పందించారు. సైమా అవార్డ్స్‌కు సంబంధించి.. హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న రానా ఇలా మాట్లాడారు.. సాధారణంగా సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని చెప్పారు. ఒకరికి ఒక సినిమా నచ్చితే.. మరొకరికి ఇంకో సినిమా నచ్చుతుందని అన్నారు.

అలాగే.. ఆర్టిస్టు అభిరుచులు కూడా వేరుగానే ఉంటాయని రానా దగ్గుబాటి అన్నారు. చాలా మంది జైభీమ్‌ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని భావించారు కానీ.. అలా జరగలేదని అన్నారు రానా. దీంతో.. కొందరు వారి అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారని అన్నారు. అంతే తప్ప వారు కాంట్రవర్సీలు చేయాలని అనుకోలేదని రానా తెలిపారు. కొందరు మాత్రమే కావాలనే.. వారి పోస్టులను కాంట్రవర్సీ చేస్తూ కామెంట్స్‌ పెట్టారని.. ఆ విధంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇక ఆర్టిస్టుల మధ్య ఎలాంటి వివాదాలు లేవని రానా దగ్గుబాటి క్లారిటీగా చెప్పారు.

ఈ నెల 15, 16 తేదీల్లో సైమా వేడుక జరగనుంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో అవార్డులు ప్రదానోత్సవం చేయనున్నారు. సైమా వేడుకతో తనకు 11 ఏళ్ల అనుబంధం ఉందని రానా చెప్పారు. గ్లోబల్‌ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక అని, ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ కలసి ఆనందంగా జరుపుకొనే వేడుక ఇది అని చెప్పాడు రానా దగ్గుబాటి. ఇదే కార్యక్రమంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్‌ పర్సన్‌ బృందా ప్రసాద్‌, శశాంక్‌ శ్రీ వాస్తవ్‌ పాల్గొన్నారు. దిగ్గజ నటులతో కలిసి సైమా వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ చెప్పారు. సైమా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి అని.. చాలా ఉత్సాహంగా ఉన్నానని మీనాక్షి చౌదరి తెలిపారు.

Next Story