కరోనా మహమ్మారి అడ్డుకునేందుకు ఫైజర్, కోవాగ్జిన్, కోవిషీల్డ్ లాంటి టీకాలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పలు దేశాల్లో వీటిని అత్యవసర వినియోగం కింద అనుమతి ఇస్తున్నారు. ముందుగా ఈ టీకాను కరోనా వారియర్స్ ఇస్తున్నారు. ఆ తరువాత 50 ఏళ్లకు పైబడిన వారికి అందిస్తున్నారు. ఇక మనదేశంలో అతి త్వరలో టీకాను ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాకాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా వాక్సిన్స్ తీసుకున్న మొదటి బాలీవుడ్ నటిగా శిల్పా శిరోద్కర్ నిలిచారు. శిల్పా.. 'గోపి కిషన్', 'బేవాఫా సనమ్', 'కిషన్ కన్హయ్య', 'హమ్' చిత్రాలతో బాలీవుడ్ చిత్రాల్లో నటించి పాపులర్ అయింది. బ్రిటన్‌కు చెందిన అపెరేష్ రంజిత్ అనే వ్యక్తిని 2000వ సంవత్సరంలో పెళ్లిచేసుకుంది.
వివాహం అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న శిల్పా 2013లో పాపులర్ సీరియల్ 'ఏక్ ముత్తి ఆస్మాన్' లో నటించింది. ప్రస్తుతం ఈ భామ యూఏఈలో నివసిస్తోంది. తాను కోవిడ్ వాక్సిన్స్ తీసుకున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆమె యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. ఆమె ఏ వాక్సిన్ ను తీసుకుందో చెప్పలేదు. శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న సంగతి తెలిసిందే.