సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతం రాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధడుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. గౌతమ్ రాజు మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు.
1954 జనవరి 15న ఒంగోల్‌లో జన్మించారు గౌతం రాజు. 1982లో 'దేఖ్ ఖబర్ రఖ్ నబర్', 'నాలుగు స్తంభాలాట' చిత్రాలతో ఎడిటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కిన సుమారు 800 పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పని చేశారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 'ఖైదీ నెంబర్ 150', 'ఆది', 'గబ్బర్‌సింగ్', 'కిక్', 'రేసుగుర్రం', 'గోపాల గోపాల', 'అదుర్స్', 'బలుపు', 'ఊసరవెల్లి',' బద్రీనాథ్', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నాడు. 'ఆది' చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు.