టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు కాస్ట్యూమ్ కృష్ణ క‌న్నుమూత‌

సీనియ‌ర్ న‌టుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత కృష్ణ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 9:45 AM IST
Costumes Krishna, Cinema news

కాస్ట్యూమ్ కృష్ణ

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ న‌టుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత కృష్ణ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని త‌న నివాసంలో ఆదివారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా ధ్రువీక‌రించారు. కృష్ణ మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణ మరణంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు.

కృష్ణ కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్‌ల‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప‌ని చేసి మంచి గుర్తింపు తెచ్చారు. తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్నారు కాస్ట్యూమ్స్ కృష్ణ. కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'భార‌త్ బంత్' చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

తరువాత విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో న‌టించారు. ఆ తర్వాత నిర్మాతగానూ ప‌లు సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో 'అశ్వద్దామ', కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'పెళ్ళాం చెపితే వినాలి', 'మా ఊరు మారదు', 'పుట్టింటికి రా చెల్లి', జగపతి బాబుతో 'పెళ్లి పందిరి' వంటి హిట్ చిత్రాలు నిర్మించారు.

Next Story