సీటీమార్ టైటిల్ సాంగ్.. యూట్యూబ్‌లో మారుమోగుతుంది
Seetimaarr Movie title song released.టాలీవుడ్‌లో ఆరడుగుల అందగాళ్లలో గోపిచంద్ ఒకరు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న
By తోట వంశీ కుమార్ Published on 3 March 2021 1:33 PM IST
టాలీవుడ్‌లో ఆరడుగుల అందగాళ్లలో గోపిచంద్ ఒకరు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్ ట్రాక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. గెలుపు సూర్యుడి చుట్టూ తిరిగేటి పొద్దుతిరుగుడు పువ్వా అంటూ మొదలయ్యే లిరిక్స్ కబడ్డీ జట్టు ఆటలో గెలుపొందేలా జోష్ నింపుతూ సాగుతుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో సీటీమార్ టైటిల్ ట్రాక్ మారుమోగుతుంది.
మణిశర్మ కంపోజ్ చేసిన మ్యూజిక్ కొత్తగా సాగుతూ అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా అనురాగ్ కులకర్ణి, రేవంత్, రామ్ పాడారు. ఈ పాట లిరిక్స్‌తో పాట వీజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. వారు ఊహించిన విధంగానే పాట అద్భుతంగా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సీటీమార్‌లో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు.
వీరితో పాటుగా భూమికా చావ్లా, రావు రమేష్, తరుణ్ అరోరా, రెహ్మాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.