ప్రముఖ దర్శక నిర్మాత బీఆర్ చోప్రా నిర్మించిన బుల్లితెర ధారావాహిక 'మహాభారత్' లో ఇంద్రుడు పాత్రను పోషించిన నటుడు సతీశ్ కౌల్ కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. మహాభారత్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన దాదాపు 300 పంజాబీ, హిందీ చిత్రాలలో నటించారు.
'కర్మ', 'ప్రేమ్ పర్బాట్', 'వారెంట్', 'గునాహో కా ఫైస్లా', 'భక్తి మీ శక్తి', 'డాన్స్ డాన్స్', 'రామ్ లఖన్', 'ప్యార్ తో హోనా హి థా' వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా ఆయన నటించారు.. సతీష్ కౌల్ ముంబై నుంచి పంజాబ్‌కు వెళ్లి 2011 లో యాక్టింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. అయితే, అది విజయవంతం కాలేదు. చివరి వరకూ నటించాలనే తపన ఉన్న సతీశ్ కౌల్ కు ఆ తర్వాత అవకాశాలూ తగ్గిపోయాయి. గత యేడాది కరోనా సందర్భంగా లాక్ డౌన్ విధించినప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ప్రేక్షకులు తనను మర్చిపోయినా బాధలేదని, వారిని మాత్రం తానెప్పుడు గుర్తుంచుకుంటానని, నటుడిగా తనకు వారి నుండి లభించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని సతీశ్ కౌర్ అంటూ ఉండేవారు.