యంగ్‌హీరో ఆది నటిస్తున్న చిత్రం 'శశి'. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్, మెగాస్టార్ చిరంజీవి వదిలిన టీజర్ మంచి స్పందనను తెచ్చుకున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 'శశి' ట్రైలర్ రిలీజ్ చేయబడింది.
మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. 'మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి' 'ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.