అక్టోబర్ 5 నుండి బిగ్ బాస్.. సమీరా రెడ్డిని కూడా అడిగారట.!
బిగ్ బాస్ షో హిందీలో మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు
By Medi Samrat Published on 7 Aug 2024 4:26 PM ISTబిగ్ బాస్ షో హిందీలో మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ OTT సీజన్ 3 ఆగస్ట్ 2న ముగిసింది. నటి సనా మక్బుల్ విజేతగా నిలిచింది. అనిల్ కపూర్ హోస్ట్ చేసిన ఈ షో ముగిసిన కొన్ని రోజులకు.. బిగ్ బాస్ సీజన్ 18 కు సంబంధించి చర్చ కొనసాగుతూ ఉంది. షోలో పాల్గొనే వారికి సంబంధించిన పోటీదారుల జాబితా ఇప్పటికే సోషల్ మీడియాలో రౌండ్లు చేయడం ప్రారంభమైంది.
ఈ రియాలిటీ షో తాజా సీజన్‌ను హోస్ట్ చేయడానికి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తిరిగి వస్తారని అనేక మీడియా నివేదికలు ధృవీకరించాయి. సల్మాన్ సికందర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నందున బిగ్ బాస్ OTT 3ని హోస్ట్ చేయలేకపోయారు. ఇక బిగ్ బాస్ హిందీ సీజన్ 18 అక్టోబర్ 5న మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 18 అక్టోబర్ మొదటి శనివారం నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు, ఏ కంటెస్టెంట్ గురించి కూడా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, చాలా మందిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ 18 కోసం లాక్ చేసిన ఎవరైనా NDA (నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్)పై సంతకం చేస్తారు, వారు షోలో భాగమైతే ఆ విషయాన్ని బయట పెట్టకూడదు. ఆ విషయాన్ని బహిర్గతం చేసినందుకు జరిమానా విధిస్తారు. నటీనటులు అర్జున్ బిజ్లానీ, కరణ్ పటేల్, సమీరా రెడ్డి, సురభి జ్యోతి, పూజా శర్మ, షోయబ్ ఇబ్రహీం, దల్‌జీత్ కౌర్ ఈ షోలో చేరవచ్చని కొన్ని మీడియా పోర్టల్స్ చెబుతున్నాయి. ఏది నిజమో త్వరలోనే తెలియనుంది. సమీరా రెడ్డి తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు.