ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏం చెప్పారంటే

RRR Movie Pre Release Event Speech.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 3:30 AM GMT
ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏం చెప్పారంటే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్రల్లో న‌టించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆశ‌లే ఉన్నాయి. అన్ని అవాంత‌రాలు దాటుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్రం బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా శ‌నివారం క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిక్‌బ‌ళ్లాపూర్‌లో శ‌నివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడ‌క‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వేడుకకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులు విచ్చేశారు.

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి సినిమా మేక‌ర్ కాద‌ని. ఆయ‌నో క్రియేట‌ర్ అని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అన్నారు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ చిత్ర‌మ‌మౌతుంద‌ని, దేశాన్ని ప్రేమించే వారంతా ఈ చిత్రాన్ని చూడాల‌ని పిలుపునిచ్చారు. ప్రాంతీయ బాష‌ల‌న్నీ అక్కాచెల్లెళ్ల‌లాంటివ‌ని.. అదే మ‌న సంస్కృతి అని అన్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులైన భ‌గ‌త్ సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, కిత్తు రాణి చెన‌మ్మ వంటి వారికి అంకిత‌మివ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇక పునీత్‌ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదని.. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్‌ జీవితంలో నెరవేరాయన్నారు. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేస్తామ‌ని చెప్పారు.

కొంచెం సంతోషం, మ‌రికొంత బాధ‌గా ఉంద‌ని కన్నడ హీరో శివరాజ్‌కుమార్ అన్నారు. ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు సంతోషంగా ఉంద‌ని.. అదే స‌మ‌యంలో అప్పు ఇక్క‌డ లేనందుకు బాధ‌గా ఉంద‌న్నారు. రామ్‌చరణ్, తారక్‌ (ఎన్టీఆర్‌)లో పునీత్‌ను చూస్తున్నాను. భార‌తీయ సినిమా ఖ్యాతిని బాహుబ‌లి పెంచిందన్నారు. కోట్లాది మంది లాగే తాను కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పారు. ఈ చిత్రంతో ఉగాది ఒక వారం ముందుగానే వ‌చ్చింద‌న్నారు.

ద‌ర్శ‌కుడు రాజమౌళి మాట్లాడుతూ.. పునీత్‌ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన 'జేమ్స్‌' సినిమా విజయమే నిదర్శనమ‌న్నారు. సినిమా గురించి చెప్ప‌గానే టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మెగాస్టార్ చిరంజీవి చొర‌వ తీసుకుని సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌డం వ‌ల్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ రేట్లు పెంపు సాధ్య‌మైంద‌న్నారు. ఆయ‌న్ను చాలా మంది చాలా ర‌కాల మాట‌లు అన్నారు. మ‌మ్మ‌ల్ని నెగ్గించ‌డానికి ఆయ‌న త‌గ్గి మాట‌ల‌న్నీ ప‌డ్డారు. చిరంజీవి గారూ మీరు నిజ‌మైన మెగాస్టార్‌. ఇక ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్‌), నా భీముడు (ఎన్టీఆర్‌) సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు అని రాజ‌మౌళి చెప్పారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు శివ‌రాజ్‌కుమార్‌తో తీర్చుకుంటాం. ఆయ‌న‌ ఎక్క‌డ ఉన్నా మ‌మ్మ‌ల్నీ ఆశీర్వ‌దిస్తారు. మార్చి 25న మా క‌ష్టం, శ్ర‌మ మీరంతా చూడ‌టానికి వ‌చ్చేస్తోంది. ఏపీ, తెలంగాణ త‌రువాత క‌ర్ణాటక పెద్ద మార్కెట్‌. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌లోనే ఈ చిత్రాన్ని చూడాలి. రాజ‌మౌళి టీమ్‌కు ధ‌న్య‌వాదాలు అని చ‌ర‌ణ్ అన్నారు

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ను దేవుడే నిర్ణ‌యించాడేమో. ఇందులో నాకు కూడా అవ‌కాశం క‌ల్పించిన రాజ‌మౌళికి ధ‌న్య‌వాదాలు అని ఎన్టీఆర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన సీఎం జగన్ గారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌గారికి కృతజ్ఞతలు చిత్ర నిర్మాత దాన‌య్య అన్నారు.

Next Story
Share it