విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) దుర్మరణం పాలయ్యారు.

By -  అంజి
Published on : 25 March 2026 6:33 AM IST

Harshil Kalia, Jaipur Road Accident, Actor Harshil Kalia Death, Shipra Path Road, Crime Next Door Actor, Model Dies in Car Crash, Rajasthan News, CCTV Accident Footage

విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) దుర్మరణం పాలయ్యారు. జైపూర్‌లోని షిప్రా పాత్ రోడ్డులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె పని ముగించుకుని రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డివైడర్‌ను ఢీకొట్టిన వేగానికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీనికి సంబంధించిన సిసిటివి (CCTV) దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి, అందులో కారు డివైడర్‌ను ఢీకొట్టి ఎడమ వైపుకు పల్టీలు కొట్టడం కనిపిస్తుంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, బోల్తా పడిన కారును సరిచేసి ఆమెను బయటకు తీశారు. తీవ్రమైన తల గాయాలతో ఉన్న హర్షిల్ కాలియాను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక వేరే వాహనం ఏదైనా ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హర్షిల్ కాలియా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె 'క్రైమ్ నెక్స్ట్ డోర్' అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఒక న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా కూడా పనిచేశారు. పలు రాజస్థానీ పాటల్లో ప్రధాన నటిగా అలరించిన ఆమె, ఇటీవల మోడలింగ్ రంగంలో రాణించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె తండ్రి కూడా జర్నలిజం రంగంలోనే ఉంటూ ఒక ప్రైవేట్ పత్రికలో పనిచేస్తున్నారు. ఈమె అకాల మరణం రాజస్థానీ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

Next Story