విషాదం.. ర‌ష్యా బాంబు దాడిలో న‌టి మృతి

Revered Ukrainian Actress Oksana Shvets Killed In Russian Rocket Attack.గ‌త 23 రోజులుగా ఉక్రెయిన్-ర‌ష్యాల మధ్య యుద్ధం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 9:05 AM IST
విషాదం.. ర‌ష్యా బాంబు దాడిలో న‌టి మృతి

గ‌త 23 రోజులుగా ఉక్రెయిన్-ర‌ష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్ప‌ట్లో ఈ యుద్దం ఆగేలా క‌నిపించ‌డం లేదు. యుద్దాన్ని ఆపేయాలంటూ అంత‌ర్జాతీయంగా ఒత్తిడులు వ‌స్తున్న‌ప్ప‌టికి ర‌ష్యా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న కీలక పట్టణాల‌పై రష్యా పట్టు బిగించింది. మరియోపోల్, ఖేర్సన్, ఖార్కీవ్, చెర్న్‌హీవ్, వొల్నోవాఖా, ఒడెస్సా.. వంటి పలు నగరాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. రష్యా సేనల దాడిలో వందలాదిమంది అమాయక ఉక్రెయిన్ ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాదిమంది దేశం దాటుతున్నారు. ఇదిలా ఉంటే.. ర‌ష్యా సేన‌లు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది. ర‌ష్యా సేన‌ల‌ను ఉక్రెయిన్ ద‌ళాలు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో కీవ్‌లోని నివాస భ‌వ‌నాల‌పై ర‌ష్యా బ‌ల‌గాలు బాంబుల వ‌ర్షం కురిపించాయి. ర‌ష్యా బాంబు దాడిలో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ మ‌ర‌ణించార‌ని ఆమె నేతృత్వంలో పనిచేస్తున్న 'యంగ్‌ థియేటర్‌' సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించింది. ఆమె వ‌య‌స్సు 67 సంవ‌త్స‌రాలు.


ష్వెట్స్ 1955లో జన్మించారు. ఇవాన్ ఫ్రాంకో థియేటర్, కీవ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో ఆమె విద్య‌ను అభ్యసించారు. సుదీర్ఘకాలం పాటు థియేటర్‌ ఆర్టిస్టుగా కొనసాగిసారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆమె సుప‌రిచితురాలు. ఈ క్ర‌మంలో ఆమె ఉక్రెయిన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకున్నారు. అనేక చిత్రాల్లోనూ ఆమె కీల‌క పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. 'టుమారో విల్ బీ టుమారో', 'ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్స్', 'ది రిటర్న్ ఆఫ్ ముఖ్తార్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'ది హౌస్ విత్ లిలీస్' అనే టీవీ షోలోనూ మెరిశారు.

Next Story