నిజంగా భయంగా ఉంది.. డీప్‌ ఫేక్‌ వీడియోపై స్పందించిన రష్మిక

రష్మిక మందన్నకు సంబంధించి ఓ డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవతోంది.

By Srikanth Gundamalla  Published on  6 Nov 2023 4:21 PM IST
rashmika, tweet,  deep fake, viral video,

 నిజంగా భయంగా ఉంది.. డీప్‌ ఫేక్‌ వీడియోపై స్పందించిన రష్మిక 

సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి సంబంధించిన పలు ఫేక్‌ వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. అప్పుడప్పుడూ వారికి సంబంధించిన ఫేక్‌ వీడియోలు, ఫొటోలు కనిపిస్తాయి. అయితే.. దాదాపుగా అలాంటి వాటి గురించి సెలబ్రిటీలు పట్టించుకోరు. ఎందుకంటే ఆదరించి అభిమానించేవారు ఎంతమంది ఉంటారో.. అలాగే విమర్శలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారూ ఉంటారు. అవన్నీ ఏవీ పెద్దగా పట్టించుకోవద్దు కూడా. కానీ.. కొన్నిసార్లు అలాంటి వారు చేసే పనులు హద్దులు మీరతాయి. తాజాగా.. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నకు సంబంధించి ఓ డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవతోంది.

ఎవరిదో వీడియోను డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేశారు కొందరు. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో.. రష్మిక ఫ్యాన్స్‌ ఆ వీడియో క్రియేట్ చేసినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. చట్టపరంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. స్వయంగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఇలాంటి వాటిపై తీవ్రంగా స్పందించాలని.. కఠినంగా శిక్షించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

అయితే.. తాజాగా ఈ డీప్‌ ఫేక్‌ వీడియోపై హీరోయిన్‌ రష్మిక మందన్న కూడా స్పందించింది. టెక్నాలజీని ఎంత దుర్వినియోగం చేస్తున్నాతో తలుచుకుంటేనే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ట్వీట్‌ చేసిన రష్మిక మందన్న.. ఇలాంటి వీడియో గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉందని చెప్పింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న తన డీప్‌ఫేక్‌ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోందని.. ఇలాంటివి తనకే కాదు.. టెక్నాలజీ దుర్వినియోగం అవుతోన్న క్రమంలో ప్రతి ఒక్కరికీ చాలా భయంగా ఉంటుందని అన్నారు. ఇవాళ తాను ఒక మహిళగా.. నటిగా మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదే తాను స్కూల్‌, కాలేజీలో ఉన్నప్పుడు జరిగి ఉంటే.. ఎలా తట్టుకోగలనో ఊహకు కూడా అందడం లేదన్నారు. అయితే.. ప్రస్తుతం తనకు మద్దతుగా ఉన్న తన కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఇలాంటి వాటిబారిన ఇంకా ఎక్కవ మంది పడకముందే సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలంటూ రష్మిక మందన్న ఎక్స్ (ట్విట్టర్‌)లో రుసుకొచ్చారు.

Next Story