'పుష్ప' గురించి రష్మిక ఏంచెప్పిందంటే..?
Rashmika reveals interesting things about Pushpa Movie. రష్మిక ఓ ఇంటర్య్వూలో పుష్ప షూటింగ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రష్మిక చెప్పింది..
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2021 11:12 AM IST
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందాన నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తుండగా.. రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా రష్మిక ఓ ఇంటర్య్వూలో పుష్ప షూటింగ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రష్మిక చెప్పింది.
ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాల్లో పుష్ప సినిమా ఎంతో విభిన్నమైన చిత్రం అని చెప్పింది. ఉదయాన్నే 5 గంటలకే షూటింగ్ ప్రారంభం అయ్యేది అని.. ఇందుకోసం తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి లొకేషన్ వెళ్లాల్సి వచ్చేదని.. షూటింగ్ పూర్తి చేసుకుని మళ్లీ తన గదికి వచ్చేసరికి రాత్రి 10అయ్యేదని చెప్పింది. ఇక భోజనం చేసి నిద్రపోయేసరికి ఒంటి గంట అవుతుందని.. దాని వల్ల రోజుకు కేవలం నాలుగు మాత్రమే నిద్రపోతున్నానని తెలిపింది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్ర్కీన్‌పై చూడొచ్చునని.. బన్నితో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా ఉందని.. ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పింది. ఆన్‌స్ర్కీన్‌లో తమ మధ్య బాగా కెమిస్ట్రీ కుదిరిందని.. బన్నితో కలిసి నటించడం సులభం అని చెప్పింది.
ఇకపోతే 'పుష్ప' లో రష్మిక కోసం ఆమె కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్రను సుక్కు క్రియేట్ చేసినట్లు సమాచారం. 'రంగస్థలం'లో సమంతకి ఎంత పేరొచ్చిందో.. ఇందులో రష్మిక కు కూడా అలానే పేరు తెచ్చిపెడుతుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా వారు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 13న ప్రేక్షకుల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.