కన్నడ పరిశ్రమలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక
Rashmika Madanna Responded About Her Ban in Kannada Movie Industry.దక్షిణాది స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు
By తోట వంశీ కుమార్
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమెను కన్నడ చిత్ర పరిశ్రకు చెందిన కొందరు నిర్మాతలు బ్యాన్ చేశారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా రష్మిక మందన్నా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది రష్మిక. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక దీనిపై స్పందించింది. కన్నడ చిత్రాలంటే తనకు ఎప్పటికీ ప్రేమ ఉంటుందని తెలిపింది. కొందరు వాస్తవాలను తెలుసుకోకుండానే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
'కాంతార' చిత్రం విడుదలైన రెండు రోజులకే ఈ చిత్రం గురించి అడగటంతో చూడలేదు కాబట్టే సరిగ్గా స్పందించలేకపోయా. ఆ తరువాత సినిమా చూసి.. చిత్ర బృందానికి మెసేజ్ చేశా. అందుకు చిత్రబృందం సైతం థ్యాంక్సు అంటూ రిప్లై ఇచ్చినట్లు చెప్పింది రష్మిక. ఇక తన వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదని, వృతి పరంగా తన చిత్రాల గురించి చెప్పడం తన బాధ్యత అని చెప్పుకొచ్చింది.
'కాంతార' చిత్రం విడుదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రాన్ని చూశారా అంటూ రష్మికను ప్రశ్నించగా 'లేదు.. అంత టైమ్ లేదు' అంటూ కాస్త వెటకారంగా చెప్పి వెళ్లిపోయింది. దీంతో నెటీజన్లు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ప్రభాస్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు సైతం సినిమాను చూసి మెచ్చుకుంటుంటే అలాంటి చిత్రాన్ని చూసేందుకు నీకు టైం లేదా అంటూ విరుచుకుపడ్డారు. ఇక కన్నడ చిత్ర పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తుండగా తాజాగా వీటిపై రష్మిక స్పందించింది.